క్షణ భంగురం!

డిసెంబరు 28, 2007

నిన్న బేనజిర్ హత్య, ఈ రోజు పీజేఆర్ మరణ వార్తలు చూస్తే జీవితం యొక్క స్వల్పకాలికత గోచరమౌతుంది. మరణం ఎప్పుడు వస్తుందో నరుడు ఎరుగడు కానీ జీవిత కాలమంతా మరణ భయంతో బ్రతుకుతూ ఉంటాడు. మానవ జీవితపు స్వల్పత్వాన్ని పరిశీలిస్తే, అనేకులు కాలాన్ని ఎలా వృథా చేసుకుంటున్నారో గ్రహించవచ్చు. మానవుడు ఈలోకంలోకి ఏమీ వెంట తేలేదు మరియు ఇక్కడ నుండి ఏమీ తీసుకొని పోలేడు. అయితే ఇవన్నీ తెలిసినా అనేకులు (కవి ధూర్జటి చెప్పినట్లు)ఇంకా “మోహార్ణవ భ్రాంతిలోనే” చరిస్తూ ఉంటారు. మనం ఈలోకంలో కేవలం యాత్రీకులం అని బైబిలు లోని మాట క్షణికమైన మానవ జీవితాన్ని చక్కగా వర్ణించింది.


బ్రతకడానికి ఏం కావాలి?

డిసెంబరు 26, 2007

మనుష్యులు బ్రతకడానికి ఏం కావాలని అడిగితే ఎవరైనా ఇచ్చే సమాధానం:తినడానికి తిండి,కట్టుకోవడానికి బట్టలు,ఉండడానికి ఇల్లు అని. యేసు అరణ్యంలో ఆకలిగొన్నప్పుడు, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని  తినమని సాతాను ఆయనను శోధించాడు. అయితే యేసు ధర్మశాస్త్రాన్ని ఉటంకిస్తూ అన్నాడు:”మానవుడు రొట్టె వలనే జీవించడు కానీ దేవుని ప్రతి మాట వల్లా జీవిస్తాడు అని వ్రాయబడివుంది.”

మనిషి కేవలం భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసమే జీవించడం లేదు కానీ అంతకంటె గొప్పవైన మానసిక,ఆధ్యాత్మిక సంతృప్తి కోసం బ్రతుకుతున్నట్లుగా యేసు మాట ధ్వనిస్తుంది. “దేవుని మాట వల్ల జీవిస్తాడు” అంటే భౌతిక జీవితాన్ని గూర్చి కాక నిగూఢ ఆధ్యాత్మిక జీవాన్ని గూర్చే యేసు మాట్లాడాడు.


క్రీస్తు జన్మ వైచిత్రి!

డిసెంబరు 24, 2007

యుగయుగాల నిరీక్షణ ఫలమైన క్రీస్తు ఒక సాధారణ హీబ్రూ కన్య మరియకు  జన్మించాడు.  మరియ విశ్వాసం చాల గొప్పది. దేవుని మాట విశ్వసించి,వివాహానికి మునుపే గర్భవతి అయ్యిందనే నింద భరించడానికి సిద్ధపడింది గనుకనే ఆమె ధన్యురాలు అయ్యింది. యేసు మనవలె స్త్రీ పురుష సంయోగంచే కాక వింతగా కన్యకు జన్మించాడు.  ఇది మానవ ఙ్ఞానానికి అందనిది. 

జగాలనేలే రాజు పశువుల తొట్టిలో పవ్వళించడం ఆయన వినయాన్ని సూచిస్తుంది. మొట్టమొదట ఆయనను దర్శించిన వారు గొర్రెల కాపరులు.అంటే యేసుకు ప్రియ బిడ్డలు సమాజంచేత తృణీకరించబడినవారే. విద్వాంసులైన ఙ్ఞానులకూ, పామరులైన గొర్రెల కాపరులకూ పూజనీయుడు యేసే. 
    


తూర్పు దేశపు ఙ్ఞానులు

డిసెంబరు 23, 2007

క్రిస్మస్ వేడుకల్లో సాధారణంగా ముగ్గురు తూర్పు దేశపు ఙ్ఞానుల(మాగి) దృశ్యం చిత్రీకరించబడుతూ వుంటుంది. అయితే బైబిలును (మత్తయి సువార్త) పరిశీలిస్తే  తూర్పు దేశ ఙ్ఞానులు ముగ్గురి కంటే ఎక్కువ కావచ్చని, వారు క్రీస్తు పుట్టిన రోజునే బెత్లెహేములో పసుల తొట్టిలో ఆయనను దర్శించలేదని,తర్వాత కొన్నాళ్ళకు బాలుడైన యేసును ఇంటిలో దర్శించి పూజించినట్లుగా తెలుస్తుంది.

మొదట వారు తూర్పు దిక్కున ఒక   గొప్ప నక్షత్రాన్ని చూశారు.ఒక రాజు పుట్టాడని గ్రహించారు. జెరూసలేం లో రాజప్రాసాదంలో పుడతాడని భావించి అక్కడకు వచ్చి వాకబు చేశారు. అయితే యోసేపు మరియల ఇంటిలో బాలయేసును కనుగొని అత్యానందభరితులై ఆయనను పూజించి తమ ప్రశస్త కానుకలు అర్పించి సంతోషంతో తిరిగి వెళ్ళారు.