గిల్లీ

జనవరి 28, 2008

క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే పురచేతివాటంగారు(southpaw ? )”ఆడం గిల్ క్రిస్ట్” అంటే నాకు అభిమానం. (ఇండియాతో ఆడేటప్పుడు ఎప్పుడు అవుటౌతాడా అని ఎదురు చూడడం సాధారణ అనుభవమే!). ఇంకా బాగా ఆడుతూ ఉండగానే సెలవు(retirement ) ప్రకటించి క్రీడా లోకాన్ని ఆశ్చర్యపరచాడు.

చంద్రునికో నూలుపోగు మాదిరి గిల్లీకో కూప (కూనలయ్య పదం)

భీతియెరుగని బ్యాటు
“గ్లవ్వు” కూడిన ఫీటు
“గిల్లుక్రిస్ట్” ఒక గ్రేటు
ఓ కూనలయ్యా! 


దేహాలయం!

జనవరి 22, 2008

జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కాదు రెండూ ఒక్కటే అని “అద్వైత” సిద్ధాంతం చెబుతుంది.   అయితే మానవుడు దేవుని సృష్టి అనీ, భౌతిక పరిమితులు గలవాడనీ బైబిలు చెబుతుంది. దేవుడు సమీపించ రాని తేజస్సుతో ఆద్యంత రహితుడై చిరకాలం వెలుగొందే వాడనీ, సర్వలోకానికీ అధిపతియైనవాడు మానవ హస్తకృతాలయాలలో నివసించడనీ వ్రాయబడి వుంది.

చేతితో చేయబడని ఆలయాలలో నివసించడు అంటే హస్తకృతాలు కాని ఆలయాలలో నివసిస్తాడనే అర్థం!

ఒకసారి యేసు యూదులతో ఇలా అన్నాడు:”మీరు ఈ దేవాలయాన్ని  పడగొట్టండి. మూడు రోజుల్లో దీనిని తిరిగి లేపుతాను”.  జెరూసలేంలో 46 యేండ్లు కట్టిన దేవాలయాన్ని పడగొట్టమన్నాడేమో అని యేసు శిష్యులు అప్పుడు భావించారు. అయితే యేసు పునరుత్థానుడైన పిదప ఆయన తన శరీరాన్ని “దేవాలయం”గా వర్ణించాడని వారు గ్రహించారు.


తెలుగుట!

జనవరి 17, 2008

మరో తెలుగు పదం ఉపయోగిద్దాం!

తెలుగుట (క్రియ) = తెలుగులో భావ వ్యక్తీకరణ
ప్రయోగం: 1. అతడు/ఆమె  చాలా బాగా  తెలుగుతాడు/తెలుగుతుంది.

          2. తెలగడం ఒక గొప్ప అదృష్టం!

          3. పుట్టుట తెలుగుట కొరకే!


విశ్వాసం

జనవరి 14, 2008

విశ్వాసానికి బైబిలు ఇచ్చిన నిర్వచనం: “నిరీక్షించే వాటిని (ఇంకా చూడని వాటిని) గురించి నిశ్చయత”. అంటే దేనినైతే నిరీక్షిస్తున్నామో దానిని తప్పక పొందుతామన్న భావన. 

యూదుల మూలపురుషుడైన అబ్రాహాము వందేళ్ళ వయసులో కేవలం దేవుని మాటను విశ్వసించడం చేత తండ్రి అయ్యాడని, అతని విశ్వాస మూలంగా నీతిమంతుడయ్యాడనీ బైబిలులో చెప్పబడింది.

ఆవగింజంత విశ్వాసముంటే చాలు ఎన్నో అసాధ్యాలు సుసాధ్యాలౌతాయని యేసు చెప్పాడు.


బ్లావి!?

జనవరి 11, 2008

కథలు వ్రాసే వాడు = కథా రచయిత = కథకుడు

నవలలు వ్రాసే వాడు = నవలా రచయిత = నవలాకారుడు

వ్యాసాలు వ్రాసే వాడు = వ్యాస రచయిత = వ్యాస కర్త

కవితలు (కవిత్వం) వ్రాసే వాడు = కవి!

బ్లాగు/లు(బ్లాగోతం) వ్రాసే వాడు = బ్లాగు రచయిత = బ్లాగరి = బ్లావి!?

ప్రయోగం: 1. అతడు గొప్ప బ్లావి. 2. ఆమె ప్రఖ్యాత బ్లావ.  3.వారు యువ బ్లావులు.

           
 


విశ్రాంతి!

జనవరి 9, 2008

విశ్రాంతి అంటే మనం సాధారణంగా చేసే పనులను చేయక మనతో మన కాలాన్ని గడపడం. మనసులో దిగులు,విచారం ఆందోళన లాంటి భావాలు లేక శాంతి నెలకొనడం. అనాది కాలం నుండీ పనిపాటలకు అలవాటు పడ్డ మనిషి విశ్రాంతి ప్రాముఖ్యతను మరచిపోతున్నాడు. దేవుడు ఆరు రోజుల్లో సృష్టి చేసి ఏడవ రోజు విశ్రమించి దానిని పరిశుద్ధ పరిచాడని బైబిలులో వ్రాయబడివుంది. అంటే విశ్రాంతికీ పవిత్రతకూ ఏదో సంబంధమున్నట్లుగా అవగతమౌతుంది.  విశ్రాంతి అంటే ఏ పనీ చేయకుండా ఉండడంకాదుగాని, సాధారణ పనులనుండి దృష్టి మరల్చడం.
  
యేసు అన్నాడు:” ప్రయాసపడి భారముతో వున్న సకల ప్రజలారా, నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి ఇస్తాను.” లోకంలో చింతాక్రాంతులై భారభరితహృదయులైనవారికి యేసు ఆధ్యాత్మిక “విశ్రాంతి” వాగ్దానం చేశాడు.      


నెనళ్ళు!

జనవరి 7, 2008

బ్లాగ్లోకంలో “Thanks” (కృతఙ్ఞతలు) అనే అర్థంలో విరివిగా వాడబడుతున్న మాట: “నెనరులు”. అయితే దీన్ని ఇంకొంచెం సులభం చేసి “నెనళ్ళు” అనవచ్చని నా భావన.

ఉదాహరణకు:

ఊరు + లు = ఊరులు …. ఊళ్ళు
నీరు + లు = నీరులు …. నీళ్ళు
కుదురు+ లు = కుదురులు …. కుదుళ్ళు

చిగురు+లు = చిగురులు …. చిగుళ్ళు
నెనరు + లు = నెనరులు …. నెనళ్ళు!

ప్రేమతో, కరుణతో, కృతఙ్ఞతతో అనే అర్థంలో “నెనరుతో” అనేమాట ప్రాచుర్యమైనట్టు కనబడడంలేదు.